ఎదుటివారిని సంతోషపెట్టడమనే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే | People Pleaser habits| Effects of Being a People Pleaser| People helping nature| Might Be a People Pleaser

posted on Nov 24, 2023 2:45PM

ఎదుటివారిని సంతోషపెట్టడమనే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..

సంతోషం సగం బలం అని అంటారు. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, మనవాళ్లన,  ఇతరులను కూడా సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత అని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది మంచి విషయమే అయినా ఇలాంటి అలవాటు క్రమంగా మనిషి దుఃఖానికి కూడా కారణం అవుతుందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్లు. దీనికి కారణం ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తాపత్రయపడేవాళ్ల గురించి పట్టించుకునేవారు బహుశా తక్కువే ఉంటారు. మరికొందరు ఇలాంటివారి సంతోషాన్ని కూడా అణిచివేయాలని, చిదిమేయాలని చూస్తారు. దీనికి కారణం తమను పట్టించుకోకుండా వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచిస్తారేమో అనే అనుమానంతో కూడిన స్వార్థం. ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడతారు. తమకంటూ ఎలాంటి వ్యక్తిగత ఆనందాలు ఏర్పరచుకోలేరు. ఇతరుల సంతోషం కోసం ఆరాటపడే అలవాటు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంతోషం అవసరం. ఈ అలవాటు ఎలా మార్చుకోవాలంటే..

కాదని చెప్పడం నేర్చుకోవాలి..

ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెబితే వారు బాధపడతారేమోననే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి వారు తమకు నష్టం కలిగినా, తమకు ఇబ్బంది ఉన్నా ఇతరులకు కాదని చెప్పకుండా అనవస ప్రయాసలు పడుతుంటారు. చిన్న విషయాలలో ఇలా ఉన్నా పర్లేదు.. కానీ పెద్ద పెద్ద విషయాలలో మాత్రం ఇలాంటి మొహమాటపు బరువు మీద వేసుకోకూడదు. ఏ పని అయినా చేసే ఉద్దేశ్యం లేకపోయినా, వీలు లేకపోయినా, తెలియకపోయినా నావల్ల కాదు అని స్పష్టంగా చెప్పడం మంచిది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని పెద్దలు చెప్పిన మాట మరవకూడదు.

సరిహద్దు గీతలుండాలి..

ఇతరులు అతి చనువుగా దగ్గర చేరి స్వార్థంతో పనులు చేయించుకుంటారు. మీ సమయాన్ని చాలా ఈజీగా లాక్కుంటారు. ఆ పనులన్నీ అయ్యాక కోల్పోయిన సమయం గుర్తొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నష్టపోయనప్పుడు తప్ప  తాము చేసిన పని పర్యావసానం అర్థం కాదు చాలామందికి. కొందరైతే తమ అవసరాలు ఖచ్చితంగా తీరాల్సిందేనని బలవంతం చేస్తారు. ఎమోషన్ బ్లాక్మెయిల్ కు కూడా వెనుకాడరు. అందుకే ప్రతి ఒక్కరినీ ఒక్క సరిహద్దు గీత వద్దే ఉంచాలి.

మార్పు సాధ్యమే..

ఇతరులను సంతోషపెట్టడమనే అలవాటు వల్ల నష్టాలు ఎదుర్కొన్నా సరే కొందరు అంత ఈజీగా మారలేరు. మారాలని అనుకుని  తరువాత మళ్లీ మామూలైపోయేవారు ఉంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ వాటిలో లీనమైపోవడం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు పనులున్నాయని చెప్పడానికి వీలవుతుంది. పైపెచ్చు మీ జీవితంలో అభివృద్ది కూడా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా మరీ మెతకగా మాట్లాడకూడదు. “నో” అనే మాట చెప్పడానికి సంకోచించకూడదు. చాలా ధృడంగా ఆ మాట చెప్పాలి. లేదంటే స్వార్థపరులు ఆ మాటను కూడా చాలా సిల్లీగా కొట్టిపడేసి తమ అవసరాలు తీర్చమని ఫోర్స్ చేస్తారు.

వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని గుర్తించాలి..

ఇతరుల కోసం బ్రతుకుతూ ఇతరులను సంతోషపెట్టేవారు ఎక్కువగా తమ ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే తమకంటూ ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్చించరు. కానీ వాటిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్ లో కొలీగ్స్, బంధువులు ఇలా అన్నిచోట్లా మీకు ఇష్టాఇస్టాలను వ్యక్తపరచడం, నచ్చని వాటిని నచ్చలేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకంటూ స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఉన్నాయని ఇతరులు గుర్తించేలా మీరే చేయాలి.

                                                     *నిశ్శబ్ద

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top