ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినచ్చా? చలికాలంలో ఈ నిజాలు తెలుసుకుని తీరాలి! | How Many Times Can You Reheat Food Safely|Food poisoning

posted on Dec 4, 2023 10:15AM


ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. మనిషి ఆయుష్షు చాలా వరకు  ఆరోగ్యకరమైన ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆహారం తరువాత వ్యాయామం, అలవాట్లు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అయితే చలికాలంలో చాలామంది ఆహారం దగ్గరే పెద్ద తప్పు చేస్తారు. ఉదయం అయినా మధ్యాహ్నం అయినా వండిన ఆహారం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది. చలికాలంలో ఆహారాన్ని చల్లగా తినలేక దాన్ని మళ్లీ వేడి చేస్తుంటారు. అయితే ఇలా వేడి చేయడం అస్సలు మంచిది కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కింది ఆహారాలు అయితే పొరవాటున కూడా వేడి చేయకూడదని చెబుతున్నారు. ఈ ఆహారాల గోల ఏంటో తెలుసుకుంటే..

చలికాలంలో పొరపాటున కూడా మళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పాలకూర, క్యారెట్లు, ఆకుకూరలు, బీట్రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు ముఖ్యమైనవి. పాలకూరను చాలామంది పప్పుగానే వండుతారు. కొందర పనీర్ తో కూర చేస్తారు. వీటిని మధ్యాహ్నం వండితే చాలావరకు మిగులుతాయి. చూస్తూ వీటిని పడెయ్యలేరు. అలాగని చలికాలంలో వీటిని చల్లగానూ తినలేరు. అలాంటప్పుడు మళ్లీ వేడి చేసి వేడిగా తింటారు. మిగిలిన కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇంతే.. రుచికరమైన, పోషకాలు కలిగిన ఆహారం కాబట్టి ముందు వెనుక ఆలోచించరు. కానీ ఇలా ఒకసారి వండిన ఆహారన్ని మళ్లీ వేడి చేస్తే వాటిలోని నైట్రేట్ లు వేడి వల్ల నైట్రోజినేస్ గా మారుతాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగిస్తాయి.

అన్నం గురించి అన్ని ఇళ్లలో కనిపించే సీన్ ఒకటే.. అన్నం మిగిలితే ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, కలర్ రైస్ ఇలా చాలా రకాలు చేస్తారు. అయితే అన్నం ఒక్కసారి వండిన తరువాత మళ్లీ దాన్ని వేడి చేయకూడదు. ఫుడ్ స్టాండర్ ఏజెన్సీ ప్రకారం అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల పుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అన్నంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.

మాంసాహారం పడెయ్యాలంటే ఎవ్వరికీ మనసొప్పదు. పైగా ఖరీదైన ఆహారం కూడా. మధ్యాహ్నం మిగిలితే రాత్రి, రాత్రి మిగిలితే దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ మరుసటిరోజు కూడా తింటారు. అయితే చలికాలంలో మాంసాహారాన్ని వేడిగా తినాలనే జిహ్వ చాపల్యంతో  తిన్న ప్రతీ సారి వేడి చేసుకుని తింటారు. కానీ వండిన మాంసాన్ని మళ్ళీ వేడి చేస్తే చాలా ఈజీగా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. పైపెచ్చు జీర్ణసమస్యలు కూడా పెరుగుతాయి. ఆహార నిపుణుల ప్రకారం అధిక ప్రోటీన్ ఉన్న ఆహారంలో నైట్రోజన్ ఉంటుంది. అది శరీరానికి హాని చేస్తుంది.

చాలా మంది ఇష్టంగా తినే ఆహారాలలో బంగాళాదుంపలు ఒకటి. బంగాళాదుంపలను ఒకసారి ఉడికించాక మళ్లీ వేడి చేయకూడదు. అలా చేస్తే బంగాళా దుంపల్లో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది బంగాళాదుంపల్లో ఉండే విటమిన్-బి6, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలను అన్నింటిని నాశనం చేసి శరీరానికి హాని కలిగిస్తుంది.

పుట్టగొడుగులు మంచి పోషకాహారం. ముఖ్యంగా చలికాలంలో విటమిన్-డి కావాలంటే పుట్టగొడుగులు తినాల్సిందే. దీంతో చలికాలంలో పుట్టగొడుగులు బాగా తింటుంటారు. అయితే పుట్టగొడుగులను ఒకసారి వండిన తరువాత మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు. వీటిని ఒకసారి వండి మళ్లీ వేడి చేస్తే వాటిలో ఉన్న ప్రోటీన్, ఖనిజాలు విచ్చిన్నం అవుతాయి. అవి టాక్సిన్లను విడుదల చేసి శరీరానికి హాని కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి.

                                              *నిశ్శబ్ద.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top