posted on Dec 2, 2023 1:12PM
కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన అతిపెద్ద సమస్య. సరిగ్గా గమనిస్తే మనిషి పూర్తీగా కాలుష్యపు వలయంలో నివసిస్తున్నాడు. అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, గాలిలో నాణ్యత అనేవి మచ్చుకైనా కనిపించవు. పట్టణీకరణ అభివృద్ది చెందేకొద్దీ వాతావణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో మొబైల్, ఒక్కొక్కరికి ఒక్కో బైక్, అదనంగా అందరూ కలసి బయటకు వెళ్లడానికి కారు.. ఇలా చెబుతూ పోతే వాహనాల రద్దీ కారణంగా వాతావరణం కలుషితం అవుతోంది. ఇక వ్యాపారాల కారణంగా ఏర్పడిన ఫ్యాక్టరీలు.. వాటి నుండి వెలువడే పొగ కారణంగా గణనీయంగా గాలి కాలుష్యం, ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా నీటి కాలుష్యం కూడా జరుగుతోంది. కనీసం మనిషి చేతుల్లో నియంత్రించగలిగిన వాటిని కూడా నియంత్రించకుండా చాలావరకు ప్రజలే వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. వీటన్నింటి గురించి చర్చించి వాతావరణ కాలుష్య కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయాలని ప్రతి ఏటా డిసెంబర్ 2వ తారీఖున ప్రపంచ వాతావరణ కాలుష్య నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజు చరిత్ర, దీని ప్రాధాన్యత, ప్రజల భాద్యత మొదలైన విషయాలు తెలుసుకుంటే..
పర్యావరణ కాలుష్యం ప్రజల ఆరోగ్యం, భూమిపై దాని ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ కారణంగా ఈ భూమితో పాటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రపంచాన్ని కబళిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ప్లాస్టిక్ కాలుష్యం. నేల నాణ్యతను దిగజార్చడం నుండి సముద్ర జీవులను చంపడం వరకు ప్లాస్టిక్ కాలుష్యం దారుణంగా ఉంటుంది. ఇది త్వరలోనే ప్రజల ఉనికికి కూడా శాపంగా మారే ప్రమాదం ఉంది.
ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), గ్రీన్‌పీస్ సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు కాలుష్యాన్ని నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను కోరుతున్నాయి. అయితే బాధ్యత మన ప్రభుత్వాలపై మాత్రమే ఉందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వాలు, ప్రతినిధులు మాత్రమే ముందుకు వచ్చి చేస్తే పరిష్కారమయ్యే సమస్య కాదు ఇది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయడానికి ప్రజలే ముందుకు రావాలి.
పరిశోధనలు వివిధ సర్వేల ఆధారంగా, వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోందని అంచనా వేయబడింది, అయితే ఇది తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాలలో వాయు కాలుష్యం కారణంగా మరణాల రేటు బాగా పెరిగింది. వాతావరణంలోని మార్పులే కాకుండా కరోనా వంటి దారుణమైన దాడుల తర్వాత చాలామంది ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. ఈ కారణంగా ప్రజలు చిన్న చిన్న సమస్యలకే మరణాలకు లోనవుతున్నారు. ఎక్కువశాతం మంది శ్వాస సంబంధ సమస్యలతోనే మరణిస్తున్నారు. దీని కారణంగా, WHO భారతదేశం, బంగ్లాదేశ్, ఖతార్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్,మంగోలియా వంటి కొన్ని దేశాలకు కఠినమైన గాలి నాణ్యత నిబంధనలను విధించింది.
మనలో చాలా మందికి మనం తీసుకోగల నివారణ చర్యల గురించి తెలుసు,కానీ వాటిని పాటించము. సమస్య మనది కాదులే అనే నిర్లక్ష్యం చాలామందిలో ఉంటుంది. మొక్కలను నాటడం, సరైన స్థలంలో చెత్తను వేయడం, ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం, పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను ఉపయోగించడం. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ప్రకృతి సంపదను పెరిగేలా చేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. కానీ దీన్ని పాటించేవారు తక్కువ. తెలిసిన వారికే కాదు.. తెలియని వారికి అజ్ఞానంలో ఉన్నవారికి కూడా జ్ఞానోదయం చేయాలి. కాలుష్యం వల్ల ఎదురయ్యే ప్రాణాంతక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పరిస్థితి తీవ్రతను తెలియజేయాలి. అంతేకాకుండా వీటిని ఇంటి నుండే ప్రారంభించాలి. కాబట్టి మీరు మీ పిల్లలు, యువ తరానికి స్థిరమైన భవిష్యత్తును సృష్టించాలనుకుంటే, వాతావరణాన్ని కాపాడే విషయంలో ఎలాంటి జాప్యం చేయకూడదు. ఇతరులు చేయట్లేదు మనమెందుకు చేయాలనే వాదాన్ని పక్కన పెట్టి మీకు మీరుగా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రకృతి సంపదను పెంచడానికి కృషి చేయాలి. ఇలా చేస్తే సగటు పౌరుడిగా సమాజం కోసం తమ వంతు కృషి చేసినట్టే.
*నిశ్శబ్ద.