కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఎలాంటి  లాభాలో తెలుసా!

posted on Nov 18, 2023 10:50AM

కొబ్బరినీరు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అనుకోవచ్చు. ఈ సహజసిద్దమైన నీటిలో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు,  యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్ లు, విటమిన్-బి కాంప్లెక్స్ లు, విటమిన్-సి ఇలా చాలా పోషకాలు ఉంటాయి. అనారోగ్యం చేసినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఎండ కారణంగా అలసిపోయినప్పుడు, వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉండాలని ఇలా చాలా కారణాలుగా కొబ్బరి నీరు తాగుతారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడే కొబ్బరి నీరు అమృతంతో సమానమనడంలో సందేహం లేదు. లేత కొబ్బరి  బొండాంలో ఉండే కొబ్బరి నీరు కాస్త ఉప్పగా ఉంటుంది. ఈ నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. కొబ్బెర పట్టిన కొబ్బరి బొండాంలో నీరు తియ్యగా ఉంటుంది. ఇందులో కేలరీలు కాసింత ఎక్కువ ఉన్నా ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అయితే కొబ్బరి నీరు తాగే సమయాన్ని బట్టి దాన్నుండి కలిగే ప్రయోజనాలు కూడా మారతాయి. ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే..

ఉదయాన్నే పరగడుపున..

ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది ఉదయాన్నే లేత కొబ్బరి బొండాం నీటిని తాగుతారు. అధిక వేడి శరీరం ఉన్నవారికి ఇది భలే ఉపయోగపుడుతుంది. ఎందుకంటే పరగడుపున కొబ్బరినీరు తాగితే శరీరంలో అధిక ఉష్టోగ్రత తగ్గిస్తుంది.

భోజనం తరువాత..

భోజనం తరువాత కొబ్బరి బోండాం తాగేవారు తక్కువే. అయితే భోజనం చేసిన కొద్దిసేపటి తరువాత కొబ్బరి బోండాం నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి జీర్ణం కావడం సులువే.  కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడేవారు ఇలా భోజనం తరువాత కొబ్బరినీరు ట్రై చేయవచ్చు.

నిద్రపోయే ముందు..

రాత్రి పడుకునేముందు పాలు తాగే వారు అధికం. కానీ పడుకునే ముందు కొబ్బరినీరు తాగితే మానసిక సమస్యలు చాలా దూరం ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో టాక్సిన్ లు తొలగిస్తుంది.

వ్యాయామం తరువాత..

అధికంగా వ్యాయామం చేసేవారు, ఆటగాళ్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడుతుంది. అలాంటి సందర్బాలలో కొబ్బరి నీరు తాగడం వల్ల కోల్పోయిన  ఎలక్ట్రోలైట్లు భర్తీ అవుతాయి. ఆటలోనూ, వ్యాయామంలోనూ అలసిన శరీరానికి ఇది ఓదార్పును ఇస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.  తల్లి పాలలో లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇదే పదార్థం కొబ్బరినీళ్లలో కూడా ఉంటుంది. దీని కారణంగా కొబ్బరినీరు తాగితే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది.

మద్యం తాగాలని అనిపించినప్పుడు..

మద్యం తాగే అలవాటున్న చాలామంది తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటారు. కొందరు మద్యం మానేయాలని ప్రయత్నించినా అందులో సఫలం కాలేరు. అయితే మద్యం తాగాలని అనిపించినప్పుడల్లా కొబ్బరినీరు తాగాలి. మద్యానికి బానిసైనవారు మద్యం తాగకపోతే తల తిరిగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొబ్బరినీరు ఈ లక్షణాలు తగ్గిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను కూడా భర్తీ చేస్తుంది.

                                                        *నిశ్శబ్ద.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top