నమ్మకం విజయానికి తొలి అడుగు అంటారెందుకు? | why confidence is the first step for success| Reasons Believing in Yourself Is the First Step to Success| confidence is the key to success essay

posted on Nov 22, 2023 9:30AM

మనిషికి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యం. అది మనిషి జీవితాన్ని ఎప్పుడూ మెరుగ్గా ఉండేలా, ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఓ చిన్న కథ అదే చెబుతుంది…..

పూర్వం ఒక రాజు వుండేవాడు. అతని భార్య గొప్ప అందగత్తె.  ఆమెను చాలా ప్రేమతో చూసుకునేవాడు. ఆమెకు ఎక్కడ లేని నగలను దేశ విదేశాల నుంచి తీసుకువచ్చే వాడు. అరేబియా నుంచి నగల వర్తకులు నేరుగా ఆమె భవనానికి వచ్చి నగలు అమ్మేవారు. ఇలా 25 సంవత్సరాలు గడిచాయి. ఆమె అందం తగ్గింది. రాజు మరో భార్యను చేసుకున్నాడు. క్రమక్రమంగా ఆమె దగ్గరికి రావటం తగ్గించాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పెద్దభార్య భర్త తనదగ్గరకి తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తుండేది. ఆ రాజ్యంలో జరుగుతున్న విశయలు ఏమీ తెలియని ఒక అరేబియా వర్తకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన దగ్గరవున్న అత్యంత ఖరీదైన నగను పెద్ద రాణికి అమ్మడానికి సరాసరి ఆమె భవనానికి వచ్చాడు. ఆ నగను ఆమెకు చూపించాడు. ఆ రాణి ఆ నగ పనితనానికి ముచ్చటపడి కొనాలని ఆసక్తి చూపి, భర్త నిరాదరణ గుర్తుకువచ్చి మానివేసింది. 

ఆమె అనాసక్తిని అరేబియా వర్తకుడు మరొక విధంగా తలచి “అమ్మా, ఈ హారానికయ్యే సొమ్మును నాకు వెంటనే ఇవ్వవలసిన అవసరం లేదు. నేను వర్తకం నిమిత్తం మరిన్ని దేశాలు తిరగవలసివస్తుంది. సంవత్సరం తరువాత నేను మీ రాజ్యానికి తిరిగివస్తాను. అప్పుడు నాకు సొమ్ము ఇవ్వవచ్చు” అన్నాడు. 

రాణి ఇంకా తటపటాయిస్తూండగా ఆమె కొడుకైన యువరాజు ఆ హారాన్ని తీసుకొని, తల్లి మెడలో అలంకరించాడు. వర్తకుడు ఆనందంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తల్లితో “ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? సంవత్సరం లోపల ఏమైనా జరగవచ్చు. నాన్నగారు మనసు మారి మళ్లీ నీ దగ్గరకు రావచ్చు, రాజ్యాధికారం అంటే విరక్తి కలిగి నన్నే రాజుగా ప్రకటించవచ్చు. పిన్ని ఆరోగ్యానికి భంగం కలిగి రాజు నిన్నే ఆదరించవచ్చు, రాజు దురదృష్టం కొద్దీ మరణిస్తే నేనే యువరాజును కాబట్టి రాజ్యాధికారం నాకే రావచ్చు. నాన్నగారు అనారోగ్యానికి లోనైనా నాకే రాజ్యాధికారం రావచ్చు. సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చు, నేను పొరుగు రాజ్యాన్ని జయించి రాజును కావచ్చు. గుర్రం ఎగరవచ్చు, కుక్కలు సింహాలను ఎదిరించవచ్చు. సంవత్సరంలో ఈ నగల వ్యాపారి మరణించవచ్చు, ఒక సంవత్సరం తరువాత మన దగ్గరడబ్బు లేకపోతే నగ నచ్చలేదని తిరిగి అతనికే ఇచ్చేయవచ్చు. సంవత్సరం తరువాత మనదే రాజ్యం అన్న నమ్మకాన్ని పెంచుకో అమ్మా మనకి మంచి జరుగుతుంది అన్నాడు. 

వర్తకుడు తిరిగివచ్చేగడువు మూడు రోజులలోకి వచ్చింది. పెద్దరాణి ఆందోళన పడసాగింది. యువరాజు ధైర్యంగా ఉన్నాడు. పరిస్థితులలో ఏ మార్పు లేదు. రెండు రోజులలోకి వచ్చింది గడువు, పెద్దరాణి నగను వర్తకుడికి ఇచ్చేయడానికి సిద్ధపడింది ఇంతలో పిడుగులాంటి వార్త. రాజుగారిని హఠాత్తుగా కొంతమంది దొంగలు బంధించటం జరిగింది. యువరాజు ధైర్యంగా అడవికి వెళ్ళి, ఆ దొంగలను బంధించి, రాజును విడిపించాడు. రాజుగారు సంతోషించి యువరాజుకు రాజ్యం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. గడువు చివరిరోజు యువరాజుకి రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన అరేబియా వర్తకుడిని యువరాజు సాదరంగా ఆహ్వానించి, అతనికి నగకి ఇవ్వలసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉచితరీతిన సత్కరించి పంపాడు. ఏ పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పొగొట్టుకోకూడదు. నమ్మకమనే విశ్వాసాన్ని మించిన శక్తి లేదు. భవిష్యత్తు మనదేనన్న నమ్మకంతో జీవించాలి.

పైన చెప్పుకున్న కథ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏ పరిస్థితులలో అయినా నమ్మకం, ధైర్యం కలిగి ఉన్నపుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేది. ఆ విషయం ఎప్పటికీ మరచిపోకూడాది.

                                      ◆నిశ్శబ్ద.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top