posted on Nov 23, 2023 9:30AM
ఆహారం, వ్యాయామం, విశ్రాంతి మనిషికి చాలా ముఖ్యం. కానీ చాలామంది ఈ మూడింటిలోనే తప్పులు చేస్తుంటారు. వీటికి తగిన కారణాలు చూపించి సమర్థించుకుంటారు కూడా. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఉరుకుల పరుగులతో సాగిన శరీరానికి రాత్రి మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. కానీ కొందరి అవగాహనా లోపం వల్ల కనీసం ఈ రాత్రి కూడా సరైన విశ్రాంతి ఉండదు. నిద్రపోయే సమయం నుండి నిద్రించే పరిస్థితులు, ఎంత సేపు నిద్రపోతారనే విషయాల వరకు అస్సలు పట్టించుకోనే పట్టించుకోరు. నామ్ కే వాస్తి అన్నట్టుగా నిద్రను కూడా సరిపెట్టేస్తుంటారు. అయితే నిద్ర గొప్ప ఔషదం. అది సక్రమంగా ఉంటే శరీర ఆరోగ్యం చాలావరకు బాగుంటుంది. మెదడు రిలాక్స్ అవుతుంది. ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర గురించి ఉన్న అపోహలు.. సందేహాలు పటాపంచలు చేయాలంటే ఈ కింది విషయాలు చదివితే సరోపోతుంది.
రాత్రి నిద్ర..
రాత్రిళ్లే నిద్రపోవాలనే రూల్ ఉండటం వెనుక బోలెడు బయటి కారణాలు అయితే ఉండొచ్చు కానీ అసలైన కారణం వాతావరణమే. రాత్రి ప్రకృతి కూడా నిశ్శబ్దమైపోతుంది. ఆ సమయంలో నిద్రే అందరికీ మంచిది. ఉద్యోగాల పేరుతోనూ, సరదాల పేరుతోనూ కోల్పోయే నిద్రకు భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. వాటి పుణ్యమే మానసిక సమస్యలు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో లేకపోవడం, అకాల వృద్దాప్యం మొదలైనవి. కాబ్టటి రాత్రి నిద్రే బెస్టు.
ఎంతసేపు..
ప్రతి ఒక్కరూ రోజుకు 6నుండి 8 గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ చాలామంది రాత్రి సమయంలో ఇంతసేపు నిద్రపోరు. ఎప్పుడో ఒంటి గంటకు పడుకుని ఉదయమే లేచి ఉద్యోగానికి పరిగెత్తుతారు.మరికొందరు అయితే ఇలా కోల్పోయిన నిద్రను సెలవు రోజుల్లో భర్తీ చేద్దాం అనుకుంటారు. అయితే ఇవన్నీ పిచ్చి చర్యలే.. రాత్రిళ్లు ఏకధాటిగా నిద్రపోతేనే శరీరం తగినవిధంగా రిలాక్స్ అవుతుంది.
కునుకుపాట్లు..
చాలామంది కళ్లుమూసుకుని అలా కునుకుపాట్లు పడి నిమిషాల వ్యవధిలో మళ్లీ లేస్తారు. తాము నిద్రపోయామని అంటారు. కానీ అదసలు నిద్రే కాదు. నిద్రలో ఉన్నప్పుడు అసలు శరీర అవయవాల గురించి స్పృహే ఉండదు చాలామందికి. అందులోనూ ఇలాంటి కునికిపాట్లవల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగి తలనొప్పి వస్తుంది.
లైట్ వెలుతురులో నిద్ర..
అదేంటోగానీ రాత్రిపూట గదిలో చిన్న జీరో లైటో లేదా బెడ్ లైటో వేసుకోవడం మంచిదని అనుకుంటార. కానీ వెలుతురు కారణంగా నిద్రలో పదే పదే మెలకువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా నిద్రలో ఇబ్బందులున్నవారు గదిలో బెడ్ లైట్ లేదా జీరో లైట్ వేసుకోకుండా నిద్రపోవడమే మంచిది. ప్రశాంతమైన నిద్ర కావాలంటే చీకటి గదిలో పడుకోవడం బెస్ట్.
*నిశ్శబ్ద.