posted on Nov 25, 2023 11:28AM
ఆహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. సాధారణంగా ఆహారం తింటున్నప్పుడు, తిన్న తరువాత నీరు తాగుతుంటారు. ఘనాహారం తినేటప్పుడు కొంచెం అయినా నీరు తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ నిజానికి ఆహారం బాగా నమిలి తింటే అస్సలు నీరు తాగాల్సిన అవసరమే లేదని వైద్యుల నుండి పోషకాహార నిపుణుల వరకు అందరూ చెబుతారు. కానీ కొందరికి మాత్రం ఏం తిన్నా నీరు తాగే అలవాటు ఉంటుంది. టిఫిన్, స్నాక్స్, పండ్లు, భోజనం ఇలా ఏం తిన్నా నీరు తాగుతుంటారు. కానీ కొన్ని పండ్లు తిన్న తరువాత నీరు అస్సలు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ ఆ పండ్లేంటో తెలుసుకుంటే..
బొప్పాయి..
బొప్పాయిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటి ఆకులు, గింజలు, పండు అన్ని తింటారు. అయితే బొప్పాయి పండు తిన్నతరువాత నీరు తాగకూడదు. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చాలా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. బొప్పాయి తిన్నాక నీరు తాగితే జీర్ణాశయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
మామిడి పండ్లు..
నోరూరించే మామిడి పండ్లు తినడం అందరికీ మహా ఇష్టం. కానీ మామిడి పండ్లు తినగానే మామిడి పీచు పండ్లలో ఇరుక్కుందని కొందరు, అలవాటులో మరికొందరు నీరు పుక్కిలిస్తూ తాగుతుంటారు. కానీ మామిడి పండ్లు తిన్నాక నీరు తాగితే నష్టాలుంటాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్-సి, పోషకాలు శరీరానికి అస్సలు అందవు. పైపెచ్చు అజీర్ణానికి కారణమవుతుంది.
పుచ్చకాయ..
అధికశాతం నీరు కలిగిన పుచ్చ పండు తిన్నాక కూడా చాలామంది నీరు తాగుతారు. అదొక అలవాటు. పుచ్చకాయలో 90శాతం నీరు ఉంటుంది, మిగిలిన 10శాతం ఫైబర్, విటమిన్లు గట్రా ఉంటాయి. అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తీ చేస్తుంది.
పైనాపిల్..
తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్ సిట్రస్ పండు కోవకే చెందుతుంది. దీన్ని తిన్న తరువాత నీరు తాగినప్పుడు గమనిస్తే నాలుక మండినట్టు ఉంటుంది. దీనికి కారణం పైనాపిల్ లో బ్రోమెలనిన్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నాలుక మండటానికి కారణం అవుతాయి. కేవలం నాలుకే కాదు.. కడుపులో కూడా అసౌర్యం ఏర్పడుతుంది. పైనాపిల్ తినగానే నీరు తాగితే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
అరటిపండు..
అరటిపండు పౌష్టికాహారంలో ఒక భాగం. వ్యాయామం చేసిన తరువాత, ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు ఒక అరటిపండు తింటే మంచిదని చెబుతారు. అరటిపండులో కేలరీలు, పోషకాలు, చక్కెర శాతం ఎక్కువగానే ఉంటాయి. ఇక అరటిపండులో ఉండే పొటాషియం, మాంగనీస్ శరీరానికి ఎంతో అవసరం. కానీ అరటిపండు తిన్న తరువాత నీరు తాగితే పండులో పోషకాలు శరీరానికి అందవు.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పండ్లలో ఆల్రెడీ నీరు ఉంటుంది. అది శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. పండ్లలో ఉండే గుణాల కారణంగా పండ్లు తిన్న వెంటనే కొందరికి జలుబు కూడా చేస్తుంది. పండ్లను కూడా పూర్తీగా నమిలి తింటే అసలు నీరు తాగాల్సిన అవసరం ఉండదు.
*నిశ్శబ్ద.