posted on Dec 2, 2023 9:30AM
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి. సరైన ఆహారం తీసుకుంటే అసలు జబ్బుల గోల ఉండదు, అంతకు మించి మందుల తలనొప్పి అసలే ఉండదు. కానీ ఆహారాల మోజులో పడి కొందరు అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు. మన చుట్టూ ఎంతో సులువుగా లభించే ఆహారాలతోనే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. చాలాచోట్ల మునగ చెట్లు బాగా పెరిగి ఉంటాయి. వీటి కాయలు అయితే డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. కానీ మునగాకు మాత్రం డబ్బు వెచ్చించకుండానే కోసుకోవచ్చు.
ఒకవేళ మునగ చెట్లు అందుబాటులో ఉంటే మాత్రం తరచుగా మునగాకును మిస్ కాకుండా తినండి. కేవలం మునగాకే కాదు మునగ పువ్వులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మునగాకును పప్పు, కారప్పొడి, టీ వంటి వంటకాలుగానూ, మునగ పువ్వులను కూడా ఇదే విధంగానే వండుకుంటారు. చాలా మంది మునగాకును, మునగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని ఉపయోగించుకుంటారు. మార్కెట్లో కూడా మునగాకు పొడి డబ్బులు పోసి కొనాల్సి వస్తోంది. కాబ్టటి మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పోషకాలేంటో.. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..
మునగాకులో ప్రోటీన్, విటమిన్-బి6, విటమిన్-సి, విటమిన్-ఎ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు సమృద్దిగా ఉంటాయి.
మునగాకు తరచుగా తీసుకుంటే ఎముకలు బలపడతాయి. కాల్షియం తక్కువ ఉందని కాల్షియం ఆధారిత ఆహారం తీసుకున్నా ఎముకలు బలంగా మారకపోతే మునగాకును ఆహారంలో చేర్చుకోవచ్చు.
మునగాకు అల్సర్లను తగ్గించంలో అద్బుతం చేస్తుంది. ఇందులో యాంటీ అల్సర్ గుణాలు ఉన్నాయి. అల్సర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మునగాకును తింటూ ఉంటే సమస్య తొందరలోనే తగ్గిపోతుంది.
అధికబరువు సమస్య ఇప్పట్లో పెద్ద తలనొప్పిగా మారింది. కానీ బరువు తగ్గించడంలో మునగాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే పైబర్ జీర్ణాశయ పనితీరు మెరుగుపరుస్తుంది.
మునగాకులో ఉండే పైబర్ అధిక బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శరీరానికి శక్తి అందించడంలో మునగాకుది అందె వేసిన చెయ్యి. దీన్ని తింటూ ఉంటే శరీరం బలంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
అన్నింటి కంటే ముఖ్యంగా మునాకును మధుమేహం ఉన్నవారిని తినమని సిఫారసు చేస్తారు. కాస్త వైద్యం మీద అవగాహన ఉన్నవారి నుండి నైపుణ్యం ఉన్న వైద్యుల వరకు అందరూ మునగాకును తీసుకోమని సమర్థిస్తారు. మునగాకు ఆహారం ద్వారా విడుదలయ్యే చక్కెరలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగాకు తినాలి. ఐరన్ లోపం దీర్ఘకాలం పాటూ కొనసాగితే అది రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఐరన్ భర్తీ అయితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.
మునగాకు తింటే కలిగే మరో అధ్బుతమైన లాభం.. జుట్టు పెరుగుదల. చాలామంది జుట్టు పెరుగుదల కోసం తలకు హెయిర్ ప్యాక్ లు, షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. కానీ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లోపే జుట్టు పెరుగుదల లోనూ, జుట్టు రంగు లోనూ, జుట్టు మందంగానూ మారుతుంది.
*నిశ్శబ్ద.