Hyderabad Real Estate : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. భాగ్యనగరం తన పరిధిని విస్తరించుకుంటూ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను వృద్ధి చేసుకుంటుంది. అంతేకాకుండా నగరానికి అంతర్జాతీయ పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు రావడం, వాటి కార్యాలయాలను స్థాపించడంతో భౌగోళికంగా కూడా విస్తరిస్తోంది. హైదరాబాద్ పశ్చిమ, తూర్పు వైపు ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. పశ్చిమం వైపు ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, కోకాపేట్ వంటి ప్రాంతాలు నివాస, వాణిజ్య, వ్యాపార అభివృద్ధికి డఅనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోకాపేట్‌లోని భూములను హైరైజ్ రియల్ ఎస్టేట్ కోసం వేలం వేసింది. నగరంలోని తూర్పు ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరించింది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, రామాంతపూర్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్ దక్షిణ భాగంలో ఫార్మా సిటీ, ఏరోస్పేస్ పరిశ్రమలు, అనేక అంతర్జాతీయ కంపెనీలకు స్థావరంగా మారింది. హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తూ మరింత అభివృద్ధి చెందుతుంది. నగరం ఉత్తర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని కంపెనీలను ఆకర్షించడానికి, నగరంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.