[ad_1]
మవోయిస్టులకు సహకరిస్తున్నారనే అభియోగం
మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష అలియాస్ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు వాహనాల్లో ఆలకూరపాడు వచ్చిన ఎన్‌ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న శిరీషను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నించారు. ఆమెను ఎందుకు అరెస్టు చేస్తున్నారని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా అధికారులు సమాధానం చెప్పలేదు. మావోయిస్ట్ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా కూడా ఉద్యమబాటులో నడిచి, పోలీసులు ఎదురు కాల్పుల్లో మరణించాడు. గత ఏడాది ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యార్థినితో మావోయిస్టులకు వైద్యం చేయించి, వారిని మావోయిస్టుల వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందని ఎన్ఐఏ అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలతో 2022 జులై 19న ఎన్‌ఐఏ బృందం శిరీష ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లభించిన ఆధారాలతో ఆర్కే భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది.
[ad_2]